ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.ఖమ్మం, వేములవాడ, నర్సాపూర్,మహబూబాబాద్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యుత్, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని అన్నారు.
కేసీఆర్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతోపాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని తెలిపారు. అన్నివర్గాలను కడుపులోపెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని కార్యకర్తలు, అభిమానులు అన్నారు. తిరిగి కేసీఆర్ ముఖమంత్రి కావాలని, జై సీఎం.. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో మద్దతు ప్రకటించారు.