కృష్ణాజిల్లా గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గంలో నిన్నటి వరకు ఉన్న ప్రశాంత వాతావరణం.. చెల్లా చెదురైంది. వైఎస్సార్ సీపీ నాయకుడు.. దుట్టా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలోను, నియోజకవర్గంలోను కూడా కలకలం రేపాయి. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నకల్లో టీడీపీ తరఫున వంశీ విజయం సాధించారు. తర్వాత అనూహ్యంగా ఆయనను ఇదే జిల్లాకు చెందిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు.. వెంటబెట్టుకుని మరీ తీసుకువెళ్లి.. జగన్‌తో భేటీ ఏర్పాటు చేశారు. అనంతరం వంశీ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
అయితే, గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. అన్నీ తానై వ్యవహరించిన వైఎస్సార్ సీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడ చక్రం తిప్పాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. వాస్తవానికి ఈ టికెట్ దుట్టాకే దక్కాలి. అయితే, కొన్ని అనివార్య పరిస్థితుల్లో యార్లగడ్డకు టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు.దీంతో వంశీని పార్టీలోకి తీసుకువచ్చారు. కానీ, ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. అధికారులు ఎవరి మాట వినాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
నేను ఎమ్మెల్యేను పైగా జగన్ ఆశీస్సులు నాకు ఉన్నాయని చెబుతున్న వంశీ.. అన్నీ తన కనుసన్నల్లోనే జరిగేలా చక్రం తిప్పుతున్నారని దుట్టా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తనను ఇష్టపడే పిలిచారని వంశీ అంటున్నారు. ఈ క్రమంలో ‘నేను జెండాలు మార్చినవాడిని కాదు. నాది ఒకే జెండా.. వైసీపీ జెండా. నా తరువాత నా బిడ్డలు కూడా వైసీపీ వెంటే. జగన్ వెంటే ఉండాలనుకునే వాడిని. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్నో కేసులు పెట్టారు. భయపడలేదు. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అంటూ.. దుట్టా విరుచుకుపడడం రాజకీయంగా సంచలనానికి దారితీసింది.
‘వైసీపీ కార్యకర్తలను బెదిరించడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. కార్యకర్తలకు అండగా ఉంటా. కొద్ది రోజుల్లో శుభవార్త వింటారు. అవసరమైతే నేనే ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని దుట్టా వ్యాఖ్యానించడం మరింతగా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇక, ఇప్పటి వరకు గన్నవరం రాజకీయాలు ఫర్వాలేదులే అనుకున్నవారికి తాజాగా దుట్టా వ్యవహారంతో ఇక్కడి వైసీపీ పరిస్థితి దారుణమని తెలిసిపోతోంది. మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.