ఈరోజు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశమైన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఏమీ తేలలేదని తెలుస్తోంది. అందుకే ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులు తిప్పే అంశం మీద ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో లక్షా ఇరవై వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, దాన్ని తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు.
అలానే అదేవిధంగా రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ మళ్ళీ మార్చాలని తెలంగాణా అధికారులు ఏపీ అధికారులని కోరారు. కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మరోసారి భేటీ అవుతామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపినట్టు చెబుతున్నారు. దీంతో ఇప్పట్లో ఏపీ తెలంగాణా మధ్య బస్సులు లేనట్టే.