సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహ ఆవిష్కరణ చేశారు సీఎం కేసీఆర్. అనంతరం మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, గాంధీ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ మధ్య గాంధీని కించపరిచే మాటలు వింటున్నామని.. మహాత్ముడిని అలా అంటుంటే చాలా బాధ కలుగుతుందని అన్నారు సీఎం కేసీఆర్.
అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు అన్నారు. మరుగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరని వ్యాఖ్యానించారు. ప్రపంచ నేతలు ఎందరో గాంధీని ప్రేరణగా తీసుకున్నారని కొనియాడారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నెల్సన్ మండేలా వరకు అందరూ గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు అని పేర్కొన్నారు. దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శమని చెప్పారన్నారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్ముడిగా సంబోధించారన్నారు. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం అన్నారు.