పర్యావరణ హితం కోసం ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ పారిస్ మాత్రం ఈ-స్కూటర్లపై నిషేధం విధించనుంది. సెప్టెంబర్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందట. ఈ-స్కూటర్ల కోసం నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువ మంది ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పారిస్ నగరపాలక సంస్థ ఈ-స్కూటర్ల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇంతకీ పారిస్ ప్రజలు ఈవీలను నిషేధించాలని ఎందుకు కోరుతున్నారంటే..?
పారిస్ నగరంలో 2018లో తొలిసారి అద్దెకు ఈ-స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. గత రెండేళ్ల కాలంలో పారిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఈ-స్కూటర్లు కారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ-స్కూటర్ల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 24 మంది చనిపోగా.. 2022లో 459 ప్రమాదాలు జరిగాయని పారిస్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వీటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో.. 18 ఏళ్లలోపు వయసువారు కూడా అద్దెకు తీసుకుని రోడ్లపై రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. వీటి పార్కింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై వదిలేసి వెళుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దీంతో, ప్రజలు వీటిపై నిషేధం విధించాలని కోరుతున్నారట. తాజా నిర్ణయంతో సెప్టెంబరు నుంచి ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేయనున్నాయి.