నవంబర్, డిసెంబర్ మాసాలలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని, ముందస్తు ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. తన ముఖం చూసే ప్రజలు ఓటు వేశారని, తన ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు… ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సీఆర్డీఏ కమిషనర్ శ్రీలక్ష్మి గారు కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణ రాజు గారు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా చెత్త ఆర్డర్లు ఇవ్వడానికి శ్రీ లక్ష్మీ గారు ఎప్పుడూ రెడీగా ఉంటారని, ప్రభుత్వ పెద్దలు కడుపుమంటతోనే ఇదంతా చేస్తున్నారని, సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని అన్నారు.