ఈశాన్య రాష్ట్రాలు, అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఇవాళ (అక్టోబర్ 2న) సాయంత్రం 6 :15 గంటలకు మేఘాలయలోని నార్త్ గారో హిల్స్ లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో ముందుగా భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆ తర్వాత అస్సాం, పశ్చిమబెంగాల్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అయితే.. ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. అస్సాంలో నిన్న (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది. భూమిలో 17 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కూడా భూకంపం సంభవించింది. భూమిలో 5 కిలో మీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఉదయం 8 గంటల 35 నిమిషాల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో కూడా స్వల్ప భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1గా నమోదయింది.