తైవాన్ను మరోసారి భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన భూకంపంల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వచ్చిన భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని వెల్లడించారు. తైవాన్ ఉత్తర ప్రాంతంలోని తైపీలో భూమి కంపించింది. యూలీలోని ఓ రహదారి పైనున్న వంతెన నేలమట్టమైంది. ఆ సమయంలో బ్రిడ్జ్‌పై వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకోగా రక్షణ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అదే ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒక్కరిని సురక్షితంగా బయటకు తీయగా మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాయున్ పట్టణంలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లోని ఐదవ అంతస్తులో ఉన్న గది సీలింగ్ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ 36 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు.
‘ఆరెంజ్ డే లిల్లీస్’కు ప్రసిద్ధి చెందిన యులిలోని పర్వతంపై కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. విద్యుత్ లేక, ఫొన్ సిగ్నల్స్ దొరకక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. మరోవైపు.. తైవాన్ సమీపంలోని అనేక దక్షిణ జపాన్ దీవులకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వాటిని తర్వాత ఉపసంహరించుకుంది.