గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. శరీరానికి పోషకాహారం అందడంతో పాటు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చాలా సమస్యలను గింజలు రాకుండా చేస్తాయి. అందులో ముఖ్యంగా ఆలోచించే శక్తి తగ్గిపోవడం. వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చాలా మందిలో చూస్తుంటాం. చిన్నప్పుడు ఉన్నంత జ్ఞాపక శక్తి పెద్దయ్యాక ఉండదు. ఐతే వయస్సు 40, 50, 60లకి వెళ్తున్న కొలదీ ఆలోచించే శక్తి తగ్గుతుంది.
అలా తగ్గకుండా ఉండాలంటే గింజలు తినాలట. ఈ మేరకు నేషనల్ సింగపూర్ యూనివర్సిటీ వారు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తేలింది. 1992 నుండీ 2016వరకు 17000 మందిపై చేసిన పరిశోధనలో చాలా విషయాలు బయటపడ్డాయి. 40ఏళ్ళు పైబడ్డ వారు వారంలో రెండు సార్లు గింజలు తినడం వల్ల ఇతరుల కంటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగయ్యిందని తెలిపింది. అదే పరిశోధన 60ఏళ్ళ పైబడ్డ వారికి చేసినపుడు 19శాతం మందికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదట.
గింజలు తినడం వల్ల ఆలోచనా శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారట. వయసు పెరుగుతుంటే వచ్చే అనేక సమస్యలు గింజలు తినడం వల్ల తగ్గాయట. దాదాపు 60శాతం మందిలో ఈ ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయని ఏజ్ అండ్ ఏజింగ్ అనే సంస్థ పేర్కొంది. అందుకే మీ ఆహారంలో గింజలని భాగంగా చేసుకోవడం మర్చిపోవద్దు. 40సంవత్సరాల పైబడ్డ వారైతే వారానికి రెండు సార్లు, అరవై సంవత్సరాలు పైబడ్డ వారైతే నెలకి ఒకసారైనా గింజలని తినాలని చెబుతున్నారు. మరి మీరు గింజలు తింటున్నారా?