వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించిన చర్చ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని వాట్సాప్ ప్రకటించినప్పటి నుండి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. వాట్సాప్ డేటాని ఫేస్ బుక్ తో పంచుకుంటామని, కాంటాక్టులు, వినియోగ సమయం, లోకేషన్ సహా ఇతర డేటా మొత్త ఫేస్ బుక్ తో షేర్ చేయబడుతుందని తెలిసినప్పటి నుండి విమర్శలు పోటెత్తాయి. ఐతే ఈ నేపథ్యంలో వాట్సాప్ కొంత వెనక్కి తగ్గి, మే వరకు ఎలాంటి వాట్సాప్ సమాచారం ఫేస్ బుక్ తో పంచుకోమని తెలిపింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కోర్టులో తన వాదనను వినిపించింది. యూరప్ యూజర్లకి ఒకలా, ఇండియా యూజర్లకి ఒకలా ప్రైవసీ పాలసీని అప్డేట్ చేయడం సరికాదని, వాట్సాప్ లేకపోతే ఇంకేదీ లేదన్నట్లుగా ఫేస్ బుక్ ప్రవర్తిస్తుందని, ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ తీరు బేరమాడుతున్నట్లు ఉందని తెలిపింది. ప్రైవసీ పాలసీ విషయమై ఇప్పటికే వాట్సాప్ కి లేఖ రాసామని ఢిల్లీ కోర్టుకి చెప్పింది.