మరి మా సంగతేంటీ…

-

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్  కల్పిస్తూ కేంద్ర కేబినేట్  తీసుకున్న నిర్ణయాన్ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి స్వాగతించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం  లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… ఈ బిల్లును తెరాస అధినేత పూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి తోడు తెలంగాణలో ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ 2017లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపించిన విషయాన్ని ఎంపీ జితేందర్ రెడ్డి గుర్తు చేస్తూ.. తమ డిమాండ్లను కూడా ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో న్యాయం కాకుండా… ఒకే దేశం – ఒకే న్యాయం తరహాలో వ్యవహరించాలని సూచించారు. పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా.. తెలంగాణలో 50 శాతానికి మించకూడదని అడ్డుపడటం భావ్యం కాదన్నారు.

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్ లోక్ సభలో ప్రవేశపెట్టగా..దీనిపై పార్టమెంటులో వాడీ వేడి చర్చజరిగింది. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల ప్రయోజనాల అనుగుణంగా రిజర్వేషన్ల అంశాలపై తమ డిమాండ్లను పార్లమెంటు వేదికగా మరో సారి లేవనెత్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news