సందర్భం : జూన్ 4 ఎస్పీబీ బర్త్ డే
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై…అని పాడుతున్నప్పుడు ఏడ్చాడు భారతీ రాజా.. భవదీయ భారతీ రాజా అని రాయాలి. ఆ తరువాత ఇళయ రాజా లాంటి గొప్ప వారు, కె.విశ్వనాథ్ లాంటి గొప్పవారు అంతా కూడా బాలూ వెళ్లిపోయిన వేళ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి నివాళి ఇచ్చారు. ఇళయారాజా మూకాంబికా అమ్మవారి భక్తులు. ఆ తల్లికి ప్రార్థన చేస్తూ ఉండిపోయారు. నివేదన ఇస్తూ ఉండిపోయారు. అంత గొప్ప ప్రార్థనలో తమిళ సీమ ఉండిపోయింది.. కన్నీటి జడులతో ఇరు ప్రాంతాలూ తడిసిపోయాయి.
వెళ్లిపోయిన బాలూ మళ్లీ పుడతాడు. తారల జననాన్ని ఈ లోకం ఆహ్వానిస్తోంది. ఆ ఆహ్వానం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సుప్రభాత తీరాల చెంత మేల్కొల్పు అవుతుంది. పరివర్తన అవుతుంది. జీవితాన శిఖర స్థాయి ఆనందాలు కొన్నే ఉంటాయి.. శిఖరాలు విరిగినాక దుఃఖాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. శిఖరం బాలు.. ఆ కొండ చరియలు ఏ ప్రకృతి చర్యకూ విరిగి పడవు.
బాలూ సర్ గ్రేట్.. మీ పాట చిన్నప్పటి నుంచి వింటున్నాను. బాలూ సర్ లెజెండ్.. పాట నుంచి పాట వరకూ బాలూ సర్ లెజెండ్.. బాలూ పాట వాన చినుకుల కవాతు.. తుఫాను మోసుకువచ్చిన ఓ ఉద్ధృతి. ప్రళయ కాల విన్యాసాలే కాదు ఆనంద కారక గతులనూ, జతులనూ వినిపించిన మంచి గొంతుక. బాలూ సర్ కు సంగీతం తెలియదు అనగా శాస్త్రీయ సంగీతంలో కొద్ది పాటి పరిజ్ఞానం మాత్రమే ఉంది. కానీ రాజా సర్ పాటలు గొప్పగా పాడి..ఆయన మెప్పు అందుకున్నారు. ఆయన స్వర లిపిని అర్థం చేసుకోవడం, పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకోవడం ఈ రెంటి సమన్వయంతో పాడడం బాలూకు మాత్రమే తెలుసు. రాజా సర్ అనగా…ఇళయా రాజా అనే విఖ్యాత సంగీతజ్ఞులు అని !
జూన్ రెండో తారీఖు, 2022
రెండ్రోజుల కిందట ఇళయరాజా పుట్టిన్రోజు. వెలితిగానే సాగింది. రెండ్రోజుల తరువాత మీ పుట్టిన్రోజు.. ఇది కూడా ఏ వెలుగూ లేక వెలితిగానే ఉంది. ఇంత కాలం పడ్డ అవస్థలకు ఓ గమ్యం చేరుకోవడం పాఠకుడి విధి.. శ్రోత విధి. ఎన్నో సమస్యలకు విరుగుడుగా మీ పాట ఉంది. మీరున్న చోట మిక్కిలి ఆనందం కూడా ఉంది. ఆనంద నిధి ఉంది. శోకం నిండిన చోట జీవం కొత్త వర్ఛస్సు అందుకోవడం తథ్యం. మా జీవితాలకు మీరు అమూల్యం. మీ పాటలే మంచి ఆయుః ప్రమాణాలను పెంచి వెళ్లింది. కొన్ని పాటలను గూటిలో చిలక పలికిన విధంగా పలికి, చిన్నారులకు జోలాలి పాడిన వైనం ఇప్పటి జ్ఞాపకం. బాలు సర్ అంటే మంచి పాటలే కాదు నాలుగు మంచి మాటలు కూడా !
ఇంతవరకూ నా పాట నేను గొప్పగా పాడాను. నా పాట మీరు కూడా అంతే గొప్పగా పాడారు అని అంటారు బాలు. ఓ సందర్భంలో పాడుతా తీయగా అనే కార్యక్రమంలో.. ! ఆయన చనిపోయారు అన్న మాటకు అర్థం లేదు. పాడుతా తీయగా అనే విఖ్యాత రూపంలో ఉన్నారు కదా ! తప్పు ఆ విధంగా అనకూడదు. చిన్నారులను తప్పుచేస్తే దండించే మాస్టారు కాదు కానీ బుజ్జగించి బుద్ధి చెప్పే మంచి టీచర్ ఆయన. మీరు ఈ పాట ఈ విధంగా పాడారు కానీ ఇంకా బాగా పాడండి. సాధన చేస్తే మీకు మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పే ఏకైక స్వరం ఎస్పీబీ.
బాలూ సర్ లేరు అని రాయడంలో అర్థం లేదు. ఎందుకో తెలుసా తెలుగు పద్యం ఆలపించడంలో.. తెలుగు మాధుర్యం పంచడంలో ..ఆయన మనతోనే ఉన్నారు. ఉంటారు కూడా ! మన మధ్య లేని వాళ్లకు మనం నివాళి ప్రకటిస్తాం. ఉన్నవాళ్లను కూడా అంతే స్థాయిలో గుర్తించి గౌరవిస్తే ఆ నివాళికి ఓ అర్థం. ఆ విధంగా ఓ చిన్న బాధ ఆయన కుమారుడు చరణ్-ను తెలుగు చిత్ర సీమ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏడాదికో పాట ఇచ్చి ఊరుకుంటే ఎలా ? ఇప్పటికైనా ఆయనకు పాడే అవకాశాలు విరివిగా ఇవ్వాలి. అదేవిధంగా బాలు సర్ పేరిట ఒక అవార్డు ప్రకటించి ప్రతిభా మూర్తులు ఎవ్వరికైనా ! ఇవ్వాలి కదా! ఈ పాటి కూడా తెలగు చిత్ర సీమ చేయకపోతే ఆ పాటకు విలువేముంది ? ఆయన కృషికి గుర్తింపు ఎక్కడ ఉంది ? ఎనీవే డియర్ సర్ హ్యాపీ బర్త్ డే …
– రత్నకిశోర్ శంభుమహంతి, శ్రీకాకుళం