ఎడిట్ నోట్: చంద్రశేఖరుని మరో ‘కల’.!

-

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…ఇది పేరు కాదు ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. తెలంగాణ రాక ముందు వరకు కేసీఆర్ అనేది పేరు గానే ఉంది..తెలంగాణ వచ్చాక అదే ఓ బ్రాండ్ గా తయారైంది. ఇక తాను అనుకున్న తెలంగాణ కలని సాకారం చేసుకుని..రెండుసార్లు అధికారం దక్కించుకుని మూడో సారి కూడా అధికారం దక్కించుకునే దిశగా చంద్రశేఖరుని పయనం కొనసాగుతుంది. అయితే తన చిరకాల కల తెలంగాణ రాష్ట్రం రావడం సాకారమైంది. ఇప్పుడు మరో కలని సాకారం దిశగా చంద్రశేఖర్ రావు ముందుకెళుతున్నారు.

ఇప్పటివరకు కేసీఆర్ అనేక పుట్టిన రోజులు జరుపుకున్నారు..కానీ ఇప్పుడు పుట్టిన రోజు వేరు అని చెప్పాలి. విద్యార్ధి దశ నుంచి రాజకీయాలని అలవోకగా చేస్తూ వస్తున్న కే‌సి‌ఆర్..కాంగ్రెస్ లో యువనాయకుడుగా పనిచేసి..తర్వాత ఎన్టీఆర్ పై అభిమానంతో టీడీపీలోకి వెళ్ళి..మొదట ఓటమి పాలైన..తర్వాత వరుస విజయాలు అందుకుని సత్తా చాటారు. కానీ తెలంగాణ కోసం అధికారంలో ఉన్న టీడీపీని వదిలి..టీఆర్ఎస్ పార్టీని పెట్టి కొత్త రాజకీయం మొదలుపెట్టారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లి..రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని చివరికి సొంత రాష్ట్రం కలని నెరవేర్చుకున్నారు. అలాగే తెలంగాణ రావడం..తొలిసారి సీఎం అవ్వడం కూడా జరిగిపోయాయి. రెండోసారి కూడా సీఎం పీఠంలో కూర్చుని సత్తా చాటుతున్నారు. ఇలా తనదైన శైలిలో విజయవంతంగా రాజకీయం నడిపిస్తున్న కే‌సి‌ఆర్..తన రాజకీయ ప్రస్థానాన్ని మరోవైపుకు తిప్పారు.

టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చి..జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి..ఢిల్లీ పీఠంలో కీ రోల్ పోషించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పీఠంని అధిరోహించాలని చెప్పి కే‌సి‌ఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఢిల్లీ పీఠం దక్కడం అనేది పెద్ద కల అని చెప్పాలి. అంత సులువుగా ఢిల్లీ పీఠం దక్కడం అనేది కష్టమే. కానీ రాజకీయ వ్యూహాల్లో ఆరితేరి ఉన్న చంద్రశేఖరుడుకి..అది కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు. మరి ఈ పుట్టిన రోజు నుంచి కేసీఆర్ ఢిల్లీ కల నెరవేరుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version