హుజూరాబాద్ ను జిల్లా చేయాలి : ఈటల రాజేందర్

-

కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ ను జిల్లా చేయాలని.. అలాగే వావిలాల, చళ్ళురులను మండలం వెంటనే చేయాలని తెలంగాణ సర్కార్ ను డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో ఇవాళ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కనీసం తన రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి.. గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చని మండిపడ్డారు.

ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేశారని… నియోజకవర్గంలో ఉన్న అందరు అధికారులను మార్చారని మండిపడ్డారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులుగా సీఎం కెసిఆర్ కొంటున్నారని ఫైర్ అయ్యారు. కుల సంఘాల నాయకులను సక్కగా రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్ళి.. అక్కడ హరీష్ రావు బేరం కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు.

ఇవన్నీ కాక.. దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోందని… ఈ నియోజక వర్గం కానీ వారికి ఓటు ఇక్కడ కల్పిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఇంట్ల 34 ఓట్లు ఉన్నాయని… ఇంకో నేత ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారని ఆరోపణలు చేశారు. దొంగ పనులు, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారుల మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని… లేదంటే మా కార్యకర్తలే నిలువరించే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు. అధికారులు చట్ట ప్రకారం పని చేయండి.. బానిసల్లా కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news