చలికాలంలో కరోనా ప్రభావం ఎలా ఉండబోతుంది…? వైద్యులు ఏమంటున్నారు..

కరోనా మహమ్మారి ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఆరు నెలలు కావొస్తున్నా కరోనా ప్రభావం ఏమాత్రం తగలేదు. సంపూర్ణ లాక్డౌన్ ఉన్నప్పుడు కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఎప్పుడైతే అన్ లాక్ దశలోకి వచ్చామో అప్పుడే కేసుల పెరుగుదల బాగా పెరిగింది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అన్ లాక్ 4.0లో ఉన్నాం. స్కూళ్ళు, థియేటర్లు కూడా తెరుచుకోబోతున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం రానున్న కాలంలో ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వచ్చేది శీతాకాలం. ఎండాకాలంలో కరోనా ప్రభావం అంతగా ఉండదని, వర్షాకాలంలో కరోనా విస్తరణ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. వారు చెప్పినట్టుగానే వర్షాకాలం ఎక్కువ కేసులు వచ్చాయి. మరి రాబోయే శీతాకాలంలో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

కాలం మారిన కొద్దీ వైరస్ ప్రభావం కూడా మారుతుంది. రానున్న చలికాలంలో కరోనా ఉధృతి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ లాక్ 4.0 వల్ల అన్నీ కార్యకలాపాలు మొదలయ్యాయి. అదీగాక చలికాలంలో వచ్చే జలుబు, వాతావరణంలో మార్పులు కరోనా ప్రభావాన్ని మరింత పెంచుతాయని అంటున్నారు. 2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైరస్ బాధితులు బాగా పెరుగుతారని చెబుతున్నారు.

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 30మిలియన్లకి పైగా ఉన్నాయి. కరోనా కారణంగా చనిపోయిన వారు తొమ్మిది లక్షలకి పైగా ఉన్నారు. మన దేశంలో కరోనా కేసులు యాభై లక్షలు దాటాయి. 85వేల మందికి పైగాచనిపోయారు. అదీగాక రోజు రోజుకీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత, శానిటైజేషన్ మొదలగునవి కఠినంగా పాటిస్తేనే చలికాలంలో కరోనాని ఎదుర్కోవచ్చని సలహా ఇస్తున్నారు.

ఐతే చలికాలం వరకు వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అజాగ్రత్త పనికిరాదని, వ్యాక్సిన్ వస్తే మంచిదే అనీ, కానీ దానికన్నా ముందు జాగ్రత్త పడడం మంచిదని సూచిస్తున్నారు.