ఈ నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరింయట్ తో థర్డ్ వేవ్ విజృంభించడంతో ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం పలు ఆంక్షలను విధించింది. కాగ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ శాంతిస్తుంది. దీంతో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారంపై విధించిన పలు ఆంక్షలను కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. ఇక నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించు కోవడానికి అనుమతి ఇచ్చింది. ఇండోర్ లేదా బహిరంగా ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
అయితే ఇండోర్ మైదానాల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో 30 శాతం ప్రజలకు అనుమతి ఉంటుందని ప్రకటించింది. అలాగే పాదయాత్రలు, ఊరేగింపులు, రోడ్ షో లపై మాత్రం ఎలాంటి అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇంటింటి ప్రచారానికి 20 మంది కంటే ఎక్కువ వెళ్లకూడాదని తెలిపింది. అలాగే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఎవరూ అతిక్రమించద్దని సూచించింది.