రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. 5 మండల పరిషత్‌లతో పాటు 26 పంచాయతీల్లో ఉప సర్పంచ్ల ఎన్నికకు కూడా నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయా మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 5న ఎన్నిక జరగనున్నట్లు పేర్కొన్నారు.
విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నరసాపురం, పెదకూరపాడు, ఉంగుటూరు, పొదలకూరు మండల పరిషత్‌లకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షులతో పాటు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. కోనసీమ జిల్లాకు చెందిన రాయవరం మండల పరిషత్‌కు సంబంధించి ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగనుంది. అదే మాదిరిగా 26 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా మే 5నే జరగనున్నాయి.