కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నారు. మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు కూడా మాస్కులను ధరించకపోతే భారీ జరిమానాలు విధించనున్నాయి. ఈ మేరకు ఆయా దేశాల ప్రభుత్వాలు తాజాగా ప్రకటించాయి.
ఇంగ్లండ్‌లో మాస్కులను ధరించకపోతే 100 పౌండ్లు (దాదాపుగా రూ.9,400) జరిమానా విధించనున్నారు. ఈ మేరకు యూకే ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో అక్కడి స్కాట్లాండ్ దేశంతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాలు కూడా అదే రూల్‌ను పాటించనున్నాయి. మాస్కులను ధరించకపోతే భారీ జరిమానాలను విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ భీభత్సం సృష్టిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు కేవలం యూకేలోనే 1,19,90 మంది కోవిడ్ వల్ల చనిపోతారని అంచనా వేస్తున్నారు. అందువల్ల కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులను ధరించాల్సిందేనని, భౌతిక దూరం పాటించాలని.. యూకే ప్రభుత్వం అక్కడి పౌరులను హెచ్చరిస్తోంది.