ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఇంగ్లండ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇవాళ న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ పోరులో ఇంగ్లండ్ గెలుపొందింది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఇంగ్లండ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇవాళ న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ పోరులో ఇంగ్లండ్ గెలుపొందింది. మ్యాచ్ టైగా ముగిసినా.. సూపర్ ఓవర్ టైగా ముగిసినా.. బౌండరీల తేడాతో మొదటిసారిగా ఇంగ్లండ్ వరల్డ్ కప్‌ను ఎగరేసుకు పోయింది. ఈ క్రమంలో వరుసగా రెండో సారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పటికీ న్యూజిలాండ్ ట్రోఫీని దక్కించుకోలేకపోయింది.
మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ దాన్ని ఛేదించడంలో తడబడుతూ వచ్చింది. దీంతో ఆ జట్టు ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇంగ్లండ్‌ను ఆ జట్టు బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ (60 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు)లు ఆదుకున్నారు. అయినప్పటికీ న్యూజిలాండ్ బౌలర్లు ఇంగ్లండ్‌ను కట్టుదిట్టం చేయడంతో చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అవగా.. రెండు జట్ల స్కోర్లు లెవల్ అయ్యాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. ఇక కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లు చెరో 3 వికెట్లు తీయగా, మ్యాట్ హెన్రీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లు చెరొక వికెట్ తీశారు.
అయితే రెండు జట్ల స్కోరు లెవల్ అయి మ్యాచ్ టై గా ముగియడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. అయినా అది కూడా టై గా ముగిసింది. రెండు జట్లు చెరొక ఓవర్ ఆడి 6 బంతుల్లో 15 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ ద్వారా కూడా ఫలితం తేలలేదు. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఇంగ్లండ్ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు ఇంగ్లండ్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. క్రికెట్‌కు పుట్టినిల్లయిన దేశం అయినా.. ఇప్పటి వరకు 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్నా ఇంగ్లండ్‌కు ఒక్కసారి కూడా కప్ రాలేదు. అయితే ఇవాళ సాధించిన విజయంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకోగా.. వన్డే ప్రపంచ కప్ సాధించిన దేశాల సరసన ఇంగ్లండ్ చేరింది. ఈ కప్ సాధించిన 6వ దేశంగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది.