మహబూబాబాద్‌లో నేడు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు.. జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అని, ఇప్పుడు జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్. ‘తెలంగాణ వచ్చాకా చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కలెక్టరేట్ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. తెలంగాణ రాకముందు 3, 4 వైద్య కళాశాలలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నాం. మహబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండే
అందుబాటులోకి తెచ్చేలా చూస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.