దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియాకు మరో షాక్‌

-

దిల్లీ మేయర్‌ ఎన్నిక ముందున్న నేపథ్యంలో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. స్నూపింగ్ ఆరోపణలపై ఫోకస్ పెట్టిన కేంద్రం.. ఫీడ్‌బాక్‌ యూనిట్‌(FBU) స్నూపింగ్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఆయన్ను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది.

వివిధ శాఖల్లో అక్రమాలను తనిఖీ చేయడానికి ఆప్‌ సర్కారు నియమించిన ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను(ఎఫ్‌బీయూ) ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది. ఇందులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పాత్ర అధికంగా ఉందని.. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వ్యాఖ్యానించింది.

సిసోదియా, ఎఫ్‌బీయూ డైరెక్టర్‌తో పాటు ఇందులో పాత్ర ఉన్నవారిపై కేసులు నమోదు చేయడానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను సీబీఐ అభ్యర్థించింది. అందుకు అంగీకరించిన సక్సేనా.. దానిని కేంద్ర హోం శాఖకు పంపారు. ఈ క్రమంలో విచారణకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని ఎల్‌జీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

తాజా వార్తలపై సిసోదియా స్పందించారు. ‘ప్రత్యర్థులపై కేసులు బనాయించడం బలహీన, పిరికి మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆప్‌ ఎదుగుతున్న కొద్దీ.. ఇలాంటి కేసులు మరిన్ని వస్తూనే ఉంటాయి’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news