బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్..

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యచరణ విషయంలో వ్యూహాత్మకంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత బీజేపీలోకే ఈటల ప్రయాణం ఉంటుందని అనుకుంటున్నారు. అదే నిజమయ్యేలా ఉంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఈటల, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవ నినాదంతో బయటకు వచ్చానని, టీఆర్ఎస్ పార్టీలో ఉంటే బానిసగా ఉండాలని అన్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈటల బీజేపీలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది.

ఈ నెల 14వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేసారని చెప్పుకుంటున్నారు. ఈటలతో పాటు టీఆర్ఎస్ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఇంకా తుల ఉమ కూడా బీజేపీలోకి జాయిన్ అవుతున్నట్లు వినబడుతుంది. ఈటల బీజేపీలో జాయిన్ అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారతాయని చెప్పుకుంటున్నారు.