హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చేశారు. ఆయనతో పాటు బీజేపీలో చేరిన బృందం కూడా నగరానికి చేరుకున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత హైద్రాబాద్‌కు చేరుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈటలను ఆయన కొడుకు, కోడలు రిసీవ్ చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు బయట కూడా బీజేపీ నేతలు భారీగా మోహరించారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు.
అయితే ఈటల వస్తుండటంతో ఎయిర్ పోర్టు బయట కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లే క్రమంలో పోలీసులు బీజేపీ శ్రేణులు, ఈటల అభిమానులకు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్ డైరెక్ట్‌గా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ నేతలను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడతారని సమాచారం. బీజేపీ నేతగా ఈటల రాజేందర్ తొలిసారి హైదరాబాద్‌లో మాట్లాడతుండటంతో ఉత్కంఠ నెలకొంది.