అమరావతి: ఏపీలో వాహనమిత్ర సొమ్ము జమ అయింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున విడుదల అయింది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఈ సొమ్మును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆపీసులో వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఏలూరు సభలో ఇచ్చిన హామీ మేరకే నిధులు విడుదల చేశామని జగన్ చెప్పారు. ఏడాదికి అదనంగా 49, 932 మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ రూ. 759 కోట్లు సాయం చేశామన్నారు.
తాజాగా 2 లక్షల 48 వేల, 468 మందికి పైగా రూ. 248 కోట్లు సాయం చేశామని వెల్లడించారు. లబ్ధిదారుల్లో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని చెప్పారు. మూడేళ్లలో డ్రైవర్లకు రూ.30 వేలు సాయం చేస్తామని చెప్పారు. వరుసగా మూడో ఏడాది ఈ నిధులను విడుదల చేసినట్లు జగన్ పేర్కొన్నారు. ఇంకా అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ వాహన మిత్ర పథకం లేదని తెలిపారు. మంచి చేసే మనుషులపై విమర్శలు చేయడం సహజమని జగన్ అన్నారు.