మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు.. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా, కాంట్రాక్టులు రద్దు చేసినా లొంగని వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని… అలాంటి నాయకుడి పట్ల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా…. ఆయన ప్రవర్తనలో మార్పులేదని విమర్శించారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తమ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌పై ఈటల విమర్శలు గుప్పించారు.
‘అన్యాయాన్ని, అవినీతికి వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి పోరాటం. రాజగోపాల్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు జుగుప్సాకరం. అవతలివారిపై బట్ట కాల్చి మీదేసి పైకొచ్చిన వ్యక్తి మాపై విమర్శలు. ఎదుటివారిని విమర్శించేటప్పుడు సభ్యత, సంస్కారం ఉండాలి. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. సరైన ఫలితాలు రాక నిరాశ, నిస్పృహలతో రేవంత్ విమర్శలు చేస్తున్నారు.’ – ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే
‘దేశవ్యాప్తంగా క్రమంగా అంతరిస్తున్న పార్టీ కాంగ్రెస్. దశాబ్దాలుగా అధికారాన్ని చలాయించిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు కనుమరుగవుతుందో ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎమర్జెన్సీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది. కాంగ్రెస్ నేతల అహంకారం వల్లే నేడు కనుమరుగవుతోంది. కాంగ్రెస్ వైఖరి వల్లే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి.’ – ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే