మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్, అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నిజమాబాద్ పర్యటనలో ఎన్టీపీసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారన్నారు. అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు.. రాజకీయాల కోసం కాదు అని ఆయన తెలిపారు. 3 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వకున్నా రామగుండం కర్మాగారాన్ని పునరుద్ధరించాం.. పంచాయతీ భవనం మొదలు అన్నింట్లో కేంద్ర సర్కార్ నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, మొత్తం నేనే ఇస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు. మరోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను వచించే ప్రయత్నం చేస్తున్నాడని ఈటల రాజేందర్ అన్నారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాని పెద్ద మొత్తంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించే కేసీఆర్, కేటీఆర్.. ఒకసారి వచ్చి చూడండి ఏం ఇస్తుంది అనేది అని ఈటల చెప్పాడు.