అక్కడ 5-11 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్

యూరపియన్ దేశాలను కరోనా అతలాకుతలం చేస్తోంది. దీనికి తోడు ఓమిక్రాన్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ దేశాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు బూస్టర్ డోసుపై ఆలోచన చేస్తున్నాయి. దీంతో పాటు పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు 5 నుంచి 11 సంవత్సరాల  మధ్య ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. జర్మనీ, హంగరీ, గ్రీస్ మరియు స్పెయిన్‌ వంటి యూరోపియన్ దేశాలు బుధవారం నుండి 05 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాయి.

 యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ గత నెలలోనే ఐదు నుండి 11 సంవత్సరాల వయస్సు గల వారి కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ డోసులకు అనుమతి ఇచ్చింది. డెన్మార్క్ మరియు ఆస్ట్రియా నవంబరులో చిన్న పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాయి. ఇటలీ, పోర్చుగల్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, చెక్ రిపబ్లిక్, బెల్జియం, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నాయి.