ఐసీఐసీఐ బ్యాంకు, వీడియో కాన్ గ్రూప్ మధ్య జరిగిన లావాదేవీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందన్న అభియోగాలపై బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి దీపక్ కొచ్చర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం మధ్యాహ్నం నుంచి విచారిస్తున్నారు. దీంతో మంగళవారం ఆయన్ను ఢిల్లీ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
అలాగే చందాకొచ్చర్ సీఈవోగా వ్యవహరించిన సమయంలో వీడియోకాన్ సంస్థతో పాటు మరో ఏడు సంస్థలకు మంజూరైన రుణాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఏడు సంస్థలకు కలిపి రూ.7862 కోట్ల రుణాలు అక్రమంగా,నేరపూరితంగా మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ సంస్థకు రూ.1875 కోట్లు రుణ మంజూరుకు సంబంధించి చందా కొచ్చర్ క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.