అధికారంతో పాటే ఆ మాజీ మంత్రి అడ్రస్‌ లేకుండా పోయారా?

-

పార్టీకి అండగా ఉంటారని.. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని ఏరికోరి తెచ్చుకున్న నేత ఆ జిల్లాలో అడ్రస్‌ లేకుండా పోయారా? అధికారంలో ఉండగా అందలమెక్కిన ఆయన పవర్‌ పోయాకా పార్టీ ముఖమే చూడటం మానేశారట. బొబ్బిలి రాజవంశం సడన్ గా ఎందుకు రాజకీయంగా సైలెంట్‌ అయ్యింది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి చక్రం తిప్పిన కుటుంబం ఇప్పుడు ఎలాంటి హాడావిడి చేయడం లేదు.

బొబ్బిలి రాజుల్లో ఇప్పుడున్న తరంలో బేబినాయన, సుజయ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాంగ్రెస్‌, వైసీపీ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ పరిణామాలు మారడంతో టీడీపీలో చేరి మంత్రి అయ్యారు సుజయ కృష్ణ రంగారావు. ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి సందడీ లేదు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి రాజకుటుంబం ఓడిపోయింది. అప్పటి నుంచీ ఊరికి దూరంగా ఉంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే వచ్చి వెళ్లిపోతున్నారట. టీడీపీ కష్టాల్లో ఉంటే ఆయన మాత్రం తనకేమీ పట్టనట్లు ఉండటం కేడర్‌కు మింగుడుపడటం లేదని అంటున్నారు.

విజయనగరం జిల్లాలో టీడీపీకి సీనియర్లు ఉన్నా.. బొబ్బిలి రాజులు కూడా వస్తే ఇంకా బలోపేతం అవుతుందన్న లెక్కలతో వారిని పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. ఆ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పవర్‌లో లేకపోవడంతో అడ్రస్‌ లేకుండా పోయారని అంటున్నారు. ప్రస్తుతం బొబ్బిలిలో టీడీపీ బాధ్యతలను బేబి నాయన చూస్తున్నారు. విజయనగరం పూసపాటి రాజకుటుంబం రగడ, మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాలలో అశోక్‌ గజపతిరాజుకు అండగా నిలబడ లేదని కేడర్‌ చర్చించుకుంటోదట. మాజీ మంత్రులు, టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నా స్పందించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. కార్యకర్తలను పలకరించిన పాపాన లేదని చెవులు కొరుక్కుంటున్నారట.

ఒక్క విజయనగరం జిల్లాలోనే కాకుండా.. రాష్ట్రంలో రాజకీయం వైసీపీ వర్సెస్‌ టీడీపీ అన్నట్లు సాగుతోంది. టీడీపీలో ఎవరైనా గట్టిగా స్వరం వినిపిస్తే అస్సలు ఊరుకోవడం లేదు అధికార పక్షం. ఆ భయమో ఏమో కానీ.. బొబ్బిలి రాజులు సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో అంటీముట్టనట్లు ఉంటారో.. కేడర్‌కు ఆమడ దూరంలోనే ఉండిపోతారో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. బొబ్బిలి రాజులు తమ మౌనానికి సమాధానం చెబుతారో.. కామ్‌గా ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news