బీజేపీలో అడుగడుగునా అవమానాలే ఎదుర్కొన్నానని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ అన్నారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన ఆయన సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ‘‘తెలంగాణ పట్ల బీజేపీ వివక్ష చూపుతోంది. బీజేపీ చేస్తున్న వివక్ష, అన్యాయాన్ని చూసి రాజీనామా చేస్తున్నా. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే అర్థం లేదు. తెలంగాణకు బీజేపీ అండగా ఉంటుందన్న హామీతో పార్టీలో చేరా. కాషాయ కండువా కప్పుకున్నప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే. బీజేపీలో బీసీ నేతను పట్టించుకునేవాళ్లే లేరు.’’ అని బిక్షమయ్య గౌడ్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని, కేంద్ర మంత్రులందరూ డబుల్ ఇంజిన్ సర్కారు అంటున్నారని.. డబుల్ ఇంజిన్ సర్కార్ అనడమే తప్ప ఒక్క పైసా అదనంగా ఇవ్వట్లేదని బిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ అధిష్ఠానానికి ఏ మాత్రం పట్టులేదని చెప్పారు. శాంతి వాతావరణం చెడగొట్టేలా నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. యాదాద్రి ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న బిక్షమయ్య గౌడ్.. మిషన్ భగీరథకూ నిధులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆస్పత్రి హామీకి అతీగతీ లేదని బిక్షమయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.