బీకాంలో ఫిజిక్స్ రాజకీయల నుంచి కనుమరుగయ్యారా ?

బీకాంలో ఫిజిక్స్‌ చదివానన్న ఒకే ఒక్క కామెంట్‌తో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించారు జలీల్ ఖాన్. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారాని ఇమేజ్ ఆయనకి ఆ ఒక్క ఇంటర్యూతో వచ్చింది. ఆయనే బెజవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌. 2019ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండి.. కుమార్తెను టీడీపీ నుంచి బరిలో దించినా గెలవలేదు. ఆ తర్వాత ఏమయ్యారో ఎవరికి తెలియడం లేదు. అటు మంత్రి అవ్వాలన్న ఆశ తీరలేదు.. ఇటు కుమార్తెను ఎమ్మెల్యేగా చూడలేకపోయారు. మరి.. ఈ ఓటమి కుంగదీసిందో ఏమో.. యాక్టివ్‌ పాలిటిక్స్‌కు జలీల్‌ఖాన్‌ దూరమయ్యారనే కామెంట్స్‌ బలంగా వినిపిస్తున్నాయి.

2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయిన జలీల్‌ఖాన్‌.. మంత్రి పదవి ఆశించి టీడీపీలో చేరిపోయారు. ఇంతలో బీకాంలో ఫిజిక్స్‌ చేశానన్న కామెంట్‌తో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారని చెబుతారు. అమాత్య అని అనిపించుకోకుండానే ఎమ్మెల్యే పదవి ముగిసిపోయింది. అయినా అమెరికాలో ఉంటోన్న తన కుమార్తె షబానా ఖాతూర్‌ను రప్పించి 2019 ఎన్నికల్లో బెజవాడ పశ్చిమ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీచేయించారు. ఆ ఎన్నికల్లో కుమార్తె ఓడిపోవడంతో జలీల్‌ సైలెంట్‌ అయ్యారు.

ఎన్నిక్లలో ఓడిన జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా తిరిగి అమెరికా వెళ్లిపోయారు. దాంతో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా జలీలే ఉన్నారు. మంత్రి పదవి రాలేదన్న నిరాశతోపాటు ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆవేదనతో యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డాయట. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాస్‌ మంత్రి అయ్యారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. జనసేన కూడా నేను ఉన్నాను అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీ మాత్రం ఇంఛార్జ్‌ యాక్టివ్‌గా లేక బలహీన పడుతోందని కేడర్‌లో వినిపించే మాట.

పశ్చిమ నియోజకవర్గానికి తొమ్మిదేళ్లపాటు టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేసిన నాగుల్‌ మీరా ప్రస్తుతం అలకలో ఉన్నారట. గత ఎన్నికల్లో తనకే టికెట్‌ ఇస్తారని ఆశించారట మీరా. కానీ జలీల్‌ఖాన్‌ కుమార్తెకు టికెట్‌ ఇవ్వడంపై ఆయన అంటీముట్టనట్టు ఉంటున్నారట. అటు జలీల్‌ లేక ఇటు మీరా రాకపోవడంతో నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చంద్రబాబు దృష్టిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల ప్రకటించిన టీడీపీ కమిటీలలో వేటిల్లోనూ జలీల్‌ఖాన్‌కు చోటు దక్కలేదు. ఆయనే పదవి వద్దన్నారో లేక పార్టీనే వద్దనుకుందో కానీ.. జలీల్‌ ఏమయ్యారనే చర్చ మళ్లీ మొదలైంది.