మంత్రి బొత్స సత్యనారాయణకు అస్సలు ఇష్టం లేని శాఖ అయినా కూడా విద్యా శాఖను నిర్వర్తించాల్సి వస్తోంది. తనకు ఆ బాధ్యతలు వద్దని మళ్లీ మున్సిపల్ శాఖనే ఇవ్వండి అని అడిగినా కూడా జగన్ పట్టించుకోకపోవడం విచారకరం. దీంతో ఆయన తప్పని సరై విద్యాశాఖ ను చూస్తున్నారు. గతంలో ఆదిమూలం సురేశ్ ఈ శాఖ బాధ్యతలు చూసినప్పుడు ఇన్ని వివాదాలు లేవు. ఆయనొక మాజీ ఉన్నత అధికారి. బాగా చదువుకున్న వాడు. బొత్స కన్నా బాగా ఈ శాఖ గురించి తెలిసిన వారు. కానీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో కథ మొత్తం మారిపోయింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వచ్చి పడ్డాయి.
గత రెండేళ్లుగా కరోనా కారణంగా పరీక్షలే లేవు. విద్యార్థులను నేరుగానే ఉత్తీర్ణత శాతం ఆధారంగా పాస్ చేసి పంపారు. తొలిసారి జగన్ సర్కారు నిర్వహించిన పరీక్షలు కొన్ని వివాదాలకు తావిచ్చాయి. అధికార యంత్రాంగం ముందస్తుగా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఇప్పుడిక ఇంటర్ పరీక్షలు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు మించిన ఒత్తిడి మంత్రి బొత్సకు ఉంటుంది.
ఈ పరీక్షలు అయినా సాఫీగా సాగుతాయా అనుకుంటే అప్పుడే కొన్ని సమస్యలు వెలుగుచూస్తున్నాయి. సరైన వసతులు లేని పరీక్షా కేంద్రాలే విద్యార్థులకు స్వాగతం చెబుతున్నాయి. ముమ్మడివరం పరీక్షా కేంద్రం ఒకటి సరైన వసతులు లేని కారణంగా ఎలా ఉందో మీడియా వెలుగులోకి తెచ్చింది.ఇంకా చాలా ఉన్నాయి.. కనుక కనీస శ్రద్ధ లేకుండా యంత్రాంగం ఉంటే పరీక్షల నిర్వహణలో లోపాలు సవరించడం అసాధ్యం.
ఇప్పటికే అనేక ఒడిదొడుకుల నడుమ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ విధంగా జరుగుతూనే మరో వైపు ఇంటర్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. టెన్త్ కన్నా ఇంటర్ అత్యంత కీలకం కనుక ఇంకా జాగ్రత్తగా ప్రభుత్వం బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి అని ఇవాళ నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షలకు ఎవ్వరూ ఎటువంటి ఆటంకాలు కలుగనివ్వకూడదు అని భగవంతుడ్ని వేడుకుందాం.
ముఖ్యంగా ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో ప్రభుత్వం పరువు పోగొట్టుకుంది అని టీడీపీ అంటోంది. పలు విమర్శలు చేస్తోంది. ఈ దశలో మండుటెండల్లో జరుగుతున్న ఈ పరీక్షలు విద్యార్థుల జీవితాలను మరింత ప్రభావితం చేసేవి కనుక వారి కష్టానికి తగ్గ ఫలితం రావాలని కూడా వేడుకుందాం. ప్రియ విద్యార్థుల్లారా ! దేవదేవుని ఆశీస్సులతో పరీక్షలు బాగా రాయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్.