తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభం అందించే వ్యాపార మార్గాలు ప్రస్తుతం మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో కాపర్ (రాగి) స్క్రాప్ బిజినెస్ కూడా ఒకటి. కాపర్ స్క్రాప్ కొని అందులోంచి కాపర్‌ను వేరు చేసి అమ్మాలి. దీంతో నెల నెలా చక్కని ఆదాయం సంపాదించవచ్చు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో, అందుకు ఏమేం అవసరమో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
కాపర్ స్క్రాప్ బిజినెస్ చేసేందుకు కాపర్ స్క్రాప్ వైర్ అవసరం ఉంటుంది. ఇది మార్కెట్‌లో 1 కేజీకి రూ.200 కు లభిస్తుంది. సాధారణంగా స్క్రాప్ బిజినెస్ చేసే వారి దగ్గర కాపర్ స్క్రాప్ వైర్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. వారి వద్ద ఆ వైర్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనూ కాపర్ స్క్రాప్ వైర్ లభిస్తుంది. అలాగే ఆ వైర్ల నుంచి రాగిని వెలికి తీసేందుకు మెషిన్ అవసరం అవుతుంది. ఈ మెషిన్ ఖరీదు రూ.50వేలకు ఉంటుంది. ఇందులో సెకండ్ హ్యాండ్ మెషిన్లు అయితే రూ.25వేల నుంచి రూ.30వేలకు లభిస్తాయి. ఇక ఈ మెషిన్‌ను ఒక్కరే ఆపరేట్ చేయవచ్చు. అందువల్ల ఈ బిజినెస్ అటు నిరుద్యోగులతోపాటు ఇటు గృహిణిలకు కూడా అనువుగా ఉంటుంది.
ఇక మెషిన్‌లో పలు రకాల సైజుల్లో కాపర్ స్క్రాప్ వైర్‌లను పెట్టేందుకు గాను రంధ్రాలు ఉంటాయి. ఆ వైర్ల ఎంఎం సైజ్ ను బట్టి వాటిని ఆయా రంధ్రాల్లో పెట్టాలి. దీంతో వైర్ నుంచి పీవీసీ విడిపోయి రాగి తీగలు బయటకు వస్తాయి. ఈ క్రమంలో అలా వచ్చిన రీసైకిల్డ్ కాపర్‌ను 1 కేజీకి రూ.450 వరకు అమ్మవచ్చు. ఇక ఈ ఉత్పత్తిలో వచ్చే పీవీసీ స్క్రాప్‌ను కూడా 1 కేజీకి రూ.30 చొప్పున అమ్మవచ్చు. దీంతో రెండూ కలిపి రూ.480 వరకు లాభం వస్తుంది. ఇక అందులో స్క్రాప్ వైర్ ఖర్చు రూ.200, రూ.180 ఇతర ఖర్చులు తీసేస్తే.. రూ.100 అవుతుంది. ఇక నెలకు 1000 కేజీల వరకు రాగి తీగను ఉత్పత్తి చేయగలిగితే 1000 * 100 = రూ.1 లక్ష వరకు లాభం వస్తుంది. ఇలా నెల నెలా ఈ బిజినెస్‌లో రూ.1 లక్ష సంపాదించవచ్చు.
అయితే ఉత్పత్తి చేసిన రాగి తీగను అమ్మాలంటే.. ఆ తీగను కొనుగోలు చేసే వారితో టై అప్ అవ్వాలి. రాగి లోహంతో వంట పాత్రలు, విద్యుత్ తీగలు, ఇతర వస్తువులు తయారు చేస్తారు కనుక.. ఆ కంపెనీలకు తీగను సప్లై చేసే వారితో కాంటాక్ట్ అయితే.. వారికి నేరుగా రాగి తీగలను అమ్మి.. ఆ మేర ఎప్పటికప్పుడు ఆదాయం సంపాదించవచ్చు..!