ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ పాకిస్థాన్‌కు చెందిన పలు ఫేస్‌బుక్ అకౌంట్లను నిలిపివేసింది. తప్పుడు సమాచారాన్ని, ఇండియాకు వ్యతిరేకమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారనే నేపథ్యంలో ఫేస్‌బుక్ ఆయా అకౌంట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. మొత్తం 453 ఫేస్‌బుక్ అకౌంట్లు, 103 ఫేస్‌బుక్ పేజీలు, 78 గ్రూప్‌లు, 107 ఇన్‌స్టాగ్రాం అకౌంట్లను ఫేస్‌బుక్ నిలిపివేసింది.
భారత్ గురించి పాకిస్థాన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందని, అందుకనే ఫేస్‌బుక్ ఈ చర్యలు తీసుకుందని, దీని వల్ల ప్రపంచానికి నిజం తెలుస్తుందని.. అమెరికాలో ఐక్యరాజ్యసమితి ఇండియా రాయబారి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ మేరకు ఆ కార్యాలయం స్టాన్‌ఫోర్డ్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ (ఎస్ఐవో) ఇచ్చిన నివేదికను ట్వీట్‌కు జత చేసింది.
కాగా నిలిపివేయబడిన ఫేస్‌బుక్ అకౌంట్లు, పేజీలలో పాకిస్థాన్ ను, ఆ దేశ సీక్రెట్ సర్వీస్ సంస్థ ఐఎస్ఐని పొగుడుతూ పోస్టులు పెట్టారు. మరోవైపు భారత్‌ను విమర్శిస్తూ, ప్రధాని మోదీ కరోనా పట్ల తీసుకుంటున్న చర్యలను అవహేళన చేస్తూ పోస్టులు ఉంచారు. అందువల్లే ఫేస్‌బుక్ ఆయా అకౌంట్లు, పేజీలను సస్పెండ్ చేసింది.