ఫెయిర్‌నెస్‌ క్రీములే దండగ.. మళ్లీ పేరు మార్చడం ఎందుకు..?

-

అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడిపై అక్కడి తెల్లజాతి పోలీసు చేసిన అమానుష పనికి ఫ్లాయిడ్‌ చనిపోయాక ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్ణ వివక్షపై ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంపై అనేక మంది తమ నిరసన గళం వినిపించారు. ఇక ఈ దెబ్బకు ప్రముఖ అంతర్జాతీయ కన్‌జ్యూమర్‌ దిగ్గజ సంస్థ హిందూస్థాన్‌ యూనిలివర్‌ కూడా దిగి రాక తప్పలేదు. తమ కంపెనీ తయారు చేసే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అన్న ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ నుంచి ఫెయిర్‌ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు గతంలో ప్రకటించింది.

fairness creams are useless then why name change

అయితే హిందూస్థాన్‌ యూనిలివర్‌ ఇప్పుడదే ఫెయిర్‌నెస్‌ క్రీముకు పేరు మార్చింది. స్త్రీలు వాడే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీముకు గ్లో అండ్‌ లవ్లీ అని పేరు మార్చగా, పురుషుల ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కు గ్లో అండ్‌ హ్యాండ్‌సమ్‌ అని పేరు మార్చింది. ఈ క్రమంలో ఇవే పేర్లతో ఆయా క్రీమ్‌లను ఆ సంస్థ విక్రయించనుంది. అయితే ఇంత జరిగినా.. ఆ సంస్థ తన బిజినెస్‌ను ఎలా వదులుకుంటుంది చెప్పండి. వాటికి మనం నల్లగా ఉంటే ఎందుకో నచ్చం. అందుకని పేర్లు మార్చి అవే క్రీమ్‌లను అమ్ముతున్నాయి తప్ప.. అబ్బే.. వాటిని ఇక అమ్మబోము.. అని చెప్పాయా.. లేదు.. ఎందుకంటే వాటికి డబ్బులు కావాలి. జనాలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకోవడమే కావాలి. జనాలు తెలుపు, నలుపు మాయలో పడి ఏమైపోతే వాళ్లకెందుకు. అయినా ఆ కంపెనీలను అని ఏం లాభం. నల్లగా ఉన్నవారిని అసహ్యంగా చూడడం మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. అసలు నలుపే శుభప్రదం కాదని, నల్లగా ఉన్న వారిని అసహ్యంగా చూడాలని ఎవరు చెప్పారో తెలియదు కానీ.. ఆ విషయం మన సమాజంలో ఇతర మూఢనమ్మకాల కన్నా ప్రగాఢంగా పాతుకుపోయింది. కనుక దాన్ని మనం ఇప్పటికీ, ఎప్పటికీ అస్సలు సమాజంలోంచి తీసేయలేం.

అసలు నిజానికి ఫెయిర్‌నెస్‌ క్రీములే ఓ దండగ. వాటికి పేర్లు మార్చడం ఎందుకు ? నాటకం కాకపోతే. అక్కడికి ఏదో నల్లగా ఉన్నవారిపై అమితమైన ప్రేమ కురిపించినట్లు మల్టీ నేషనల్‌ కంపెనీల నాటకం ఒకటి. అంతగా ప్రేమే ఉంటే ఆయా క్రీమ్‌ల తయారీ ఉత్పత్తినే నిలిపివేయాలి. కానీ వాళ్లు ఆ పని ససేమిరా చేయరు. ఎందుకంటే.. ముందే చెప్పాం కదా.. వారికి జనాల డబ్బులే కావాలి. జనాలు ఏమైపోతే వారికెందుకు..? అయినా ఇలాంటి విషయాల్లో సమాజంలో మార్పు రావాలి తప్ప.. మనం ఇలా ఎన్ని మాట్లాడుకున్నా.. వృథా ప్రయాసే అవుతుంది.. కాదంటారా..!

Read more RELATED
Recommended to you

Latest news