తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. యీ తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పార్టీలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని ఓ పోలింగ్ స్టేషన్ లో బీజేపీ ఏజెంట్ గా ఉన్న వ్యక్తి పేరుతో నకిలీ ఐడీ కార్డు తీసుకుని ఓటు వేయడానికి మరో వ్యక్తి రావడం కలకలం రేపింది. అతన్ని పట్టుకున్న సదరు ఏజెంట్ పోలీసులకు అప్పజెప్పారు. మరోచోట నకిలీ ఓటర్ ఐడీ కార్డులు ఉన్న వ్యక్తులను బీజేపీ నేతలు పట్టుకున్నారు.
ఓటేయడానికి వచ్చిన వారిని తండ్రి పేరు చెప్పాలని నిలదీయడంతో.. వారు తెల్లముఖం వేశారు. అతనితో పాటు మరో పది మంది నకిలీ ఓటర్ కార్డు వ్యక్తుల్ని బీజేపీ గుర్తించింది. చిత్తూరు నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తుల్ని ఏజెంట్లు పట్టుకున్నారు. ఇక సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం బడ్డిపాలెంలో వెంకటమ్మ అనే మహిళ.. ఓటు వేయడానికి వస్తే.. చేదు అనుభవం ఎదురైంది. ఆ ఓటు అప్పటికే వేసినట్టు లిస్ట్ లో నమోదైంది. అలానే తిరుపతి అశోక్ నగర్ లో కూడా ఇలాగే ఓ వ్యక్తి ఓటును మరొకరు వేశారు.