షారుఖ్ ఖాన్‌ ఇంట్లో చొరబడ్డ ఫ్యాన్స్.. 8 గంటలు మేకప్‌రూమ్‌లో దాక్కొని

-

తమ అభిమాన నటుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాన్‌కు ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. దానికోసం పడరాని పాట్లు పడుతుంటారు. కొన్నిసార్లు హద్దులు దాటుతూ చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇంట చోటు చేసుకుంది.

షారుఖ్‌ను చూడాలనే ఆశతో ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో బాద్‌షా ఇల్లు మన్నత్‌లోకి చొరబడ్డారు. చివరికు పోలీస్‌ స్టేషన్‌ బాటపట్టారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తాజాగా ముంబయి పోలీసులు వెల్లడించారు.

గుజరాత్‌కు చెందిన 18ఏళ్ల సాహిల్ సలీం ఖాన్, అతడి స్నేహితుడు 19 ఏళ్ల రామ్‌ కుశువ.. షారుఖ్‌ని చూడాలని గతవారం మన్నత్‌లోకి చొరబడ్డారు. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మార్చి 1వ తేదీ అర్ధరాత్రి బంగ్లాలోకి ప్రవేశించిన వీరు.. మూడో అంతస్తులో ఉన్న హీరో మేకప్‌ రూమ్‌లో సుమారు ఎనిమిది గంటలపాటు దాక్కున్నారు. ఉదయాన్నే వీరిని చూసి షాకైన షారుఖ్‌ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించారు. భద్రతను కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా షారుఖ్‌కు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news