దాదాపుగా ఏడాది కాలం నుంచి రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్నారు. వారి నిరసనలకు ప్రతిఫలంగా ఈరోజు లోక్ సభలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. బిల్లు పాస్ అయింది. విపక్ష సభ్యలు నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాత బిల్లును రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ బిల్లు పాస్ అవ్వడంపై స్పందించారు. దేశంలో ఎక్కడా, ఎలాంటి నిరసనలు జరగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తాము మాత్రం రైతుల సమస్యలు పూర్తిగా తీరేదాకా ఉద్యమాన్ని ఆపేదే లేదు అని స్పష్టం చేశారు. బిల్లు పాస్ అవ్వడం ఉద్యమంలో 750 మంది రైతుల మరణానికి నివాళిగా ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకువచ్చే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. దీంతో పాటు కొత్త విద్యుత్ చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు విపక్షాలు కూడా కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంట్ లో పట్టుబడుతున్నాయి. దీనిపై విపక్షాలు నిరసన తెలుపుతున్నాయి.