కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవు….బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదు అంటూ వైటీపీ అధినేత వైఎస్ షర్మిల విమర్శలు కురిపించారు. సెకండ్ వేవ్ లో జనం పిట్టల్లా రాలిపోయారు అంటూ విమర్శలు కురిపించారు. పారాసిటమోల్ వేసుకంటే సరిపోతుందని ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి అంటూ హితవు పలికారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని… కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యాలని డిమాండ్ చేశారు. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా వైఎస్ షర్మిత తన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు.