దేశ వ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే.. మరో వైపు ఉల్లి రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధర పెరగడంతో ఉల్లి పంట వేసిన రైతులు రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. ఇక కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఏకంగా రూ.1 కోటి వరకు లాభం వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడా రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉల్లిపాయలను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ నష్టాలే వచ్చేవి. అయితే ఈ సారి కూడా అతను 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధర ఎక్కువగా ఉండడంతో అతని పంట పండింది. అతనికి అదృష్టం కలసి వచ్చింది. దీంతో అనతి కాలంలోనే అతనికి రూ.1 కోటి వరకు లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అతనికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల డబ్బు ఖర్చయింది. కానీ రూ.1 కోటి లాభం వచ్చింది. దీంతో అతను స్పందిస్తూ.. ఆ డబ్బులో కొంత డబ్బును ఖర్చు పెట్టి మంచి ఇల్లు కట్టించుకుంటానని, మిగిలిన డబ్బుతో మళ్లీ వ్యవసాయం చేస్తానని చెబుతున్నాడు. ఏది ఏమైనా.. నిజంగా అదృష్టమంటే ఇతనిదే కదా..!