ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా కల్తీ చేయబడిన ఆహార పదార్థాలే మనకు విక్రయిస్తున్నారు. దీంతో కల్తీలను గుర్తించడం మనకు కష్టతరవమవుతోంది. ఇక బాగా కల్తీ అవుతున్న ఆహార పదార్థాల జాబితాలో పాలు కూడా ఒకటి. ఇవి మనకు నిత్యం అవసరం కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాలను చాలా మంది కల్తీ చేసి విక్రయిస్తుంటారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడే పాలు కల్తీ అయ్యాయో, కాలేదో.. ఇట్టే గుర్తించవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
* పాలను సన్నని మంట మీద సుమారుగా 2 నుంచి 3 గంటల పాటు వేడి చేస్తే కోవాలాంటి పదార్థం ఏర్పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ కోవా జిడ్డుగా, నూనె తరహాలో ఉంటే అప్పుడు ఆ పాలు మంచివేనన్నమాట. అలా కాకుండా గట్టి పదార్థంగా కోవా ఏర్పడితే ఆ పాలు కల్తీ అయ్యాయని గుర్తించాలి.
* సాధారణంగా పాలను కల్తీ చేయాలనుకువారు వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతారు. అయితే అలా కెమికల్స్ కలపబడిన పాలను వేడి చేస్తే అవి త్వరగా పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. అలా మారితే ఆ పాలు కల్తీవన్నమాట. ఇక కల్తీ జరిగిన పాలను చేతిలో వేసుకుని రుద్దితే సబ్బు నుంచి నురగ వచ్చినట్లు వస్తుంది. దీంతో ఆ పాలను కల్తీ పాలని గుర్తించాలి.
* పాలలో నీళ్లు కలిపారా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే.. చేతి పిడికిలిపై ఒక పాల చుక్క వేయాలి. అనంతరం ఆ చుక్కను కిందకు ప్రవహించేట్లు చేయాలి. ఈ క్రమంలో ఆ చుక్క వెంబడి నీరు లాంటి పదార్థం కనిపిస్తే ఆ పాలలో నీటిని కలిపినట్లే లెక్క. అలా కాకపోతే పాల చుక్క కిందకు ప్రవహించే క్రమంలో దాని వెనుక ఎలాంటి నీటి లాంటి పదార్థం మనకు కనిపించదు. అలాంటి పాలను చిక్కటి పాలని గుర్తించాలి.
* కొందరు పాలను కల్తీ చేసేందుకు అందులో వనస్పతి లేదా డాల్డా కలుపుతుంటారు. నిజానికి అవి మన శరీరానికి ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. ఈ క్రమంలో మీరు వాడే పాలలో వనస్పతి లేదా డాల్డా కలపబడిందని నిర్దారించుకునేందుకు ఆ పాలను 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్, 1 టేబుల్ స్పూన్ చక్కెర కలిపి చూడాలి. ఆ తరువాత ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారితే కచ్చితంగా ఆ పాలు కల్తీ అయ్యాయని గుర్తించాలి.
* పాలలు కొందరు పిండి కలిపి వాటిని కల్తీ చేస్తుంటారు. దాన్ని గుర్తించేందుకు 5 ఎంఎల్ మోతాదులో పాలు తీసుకుని వాటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు (అయోడిన్ ఉన్నది) వేసి కలపాలి. ఈ క్రమంలో ఆ మిశ్రమం నీలి రంగులోకి మారితే ఆ పాలు కల్తీ అయ్యాయని తెలుసుకోవాలి.
* ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు చాలా మంది ఫార్మాలిన్ అనే రసాయనాన్ని కలుపుతుంటారు. అయితే పాలలో ఈ కెమికల్ ఉందో, లేదో నిర్దారించేందుకు పాలను 10 ఎంఎంల్ మోతాదులో తీసుకుని వాటిలో 2-3 చుక్కల సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. ఈ ప్రయోగాన్ని టెస్ట్ ట్యూబ్‌లో చేయాలి. ఈ క్రమంలో టెస్ట్ ట్యూబ్ పైభాగంలో నీలి రంగు రింగ్ కనిపిస్తుంది. అది కనిపించిందంటే.. ఆ పాలలో ఫార్మాలిన్ కలపబడిందని తెలుసుకోవాలి.
* ఇక చివరిగా మరొక సూచన.. సాధారణంగా చాలా మంది కల్తీ చేసేవారు.. పాలను కల్తీ చేసేందుకు ఎక్కువగా యూరియా వాడుతుంటారు. ఎందుకంటే పాలలో యూరియా కలిపితే మనకు సరిగ్గా తెలియదు. పాల రుచి కూడా మారదు. అందువల్ల పాలలో యూరియా కలపబడిందని తెలుసుకోవడం కూడా మనకు కష్టమే అవుతుంది. అయితే అలాంటప్పుడు అర టేబుల్ స్పూన్ పాలలో సోయాబీన్ పౌడర్‌ను బాగా కలిపి 5 నిమిషాల తరువాత లిట్మస్ పేపర్ తీసుకుని ఆ మిశ్రమంలో ఆ పేపర్‌ను 30 సెకన్ల పాటు ముంచాలి. దీంతో లిట్మస్ పేపర్ రంగు ఎరుపు నుంచి నీలి రంగుకు మారుతుంది. అలా గనక జరిగితే పాలలో కచ్చితంగా యూరియా కలపబడిందని తెలుసుకోవాలి..!