దేశ రాజధాని ఢిల్లీ యుద్ధరంగాన్ని తలపించింది. రిపబ్లిక్ డే రోజు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన జరిగింది. అధికారిక పరేడ్ కూడా ఆగిపోయేంత స్థాయిలో రైతుల నిరసనలు జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండా కాకుండా మరో జెండా ఎగిరింది. దాదాపు గంట పాటు శ్రమించిన రైతుల్ని ఎర్రకోట పరిసరాల నుంచి వెనక్కి పంపారు పోలీసులు. గణతంత్ర దినాన ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది.
రిపబ్లిక్ డే రోజు కవాతు చేసిన రైతులు.. ఎర్రకోట వైపు చొచ్చుకొచ్చారు. కోట గుమ్మటంపై రైతు జెండాలు ఎగరేశారు. దాదాపు గంట పాటు రైతులు ఎర్రకోటపైనే ఉన్నారు. ర్యాలీకి అనుమతి ఇచ్చిన రూట్లో కాకుండా.. వేరే దారిలో ఎర్రకోట చేరిన రైతులు.. ఢిల్లీ పోలీసులకు చుక్కలు చూపించారు.
అధికారిక పరేడ్ ముగిసిన తర్వాత ట్రాక్టర్ల ర్యాలీకి పోలీసులు అనుమతిస్తే.. అసలు పరేడ్ మొదలుకాక ముందే..రైతులు కాలినడకన ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.
పోలీసుల బారికేడ్లు దాటుకుని.. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు ఎర్రకోట చేరుకున్నాయి. అధికారిక పరేడ్ కు సమాంతరంగా రైతుల కవాతు జరగడంతో.. రాజ్ పథ్ లో శకటాల ప్రదర్శన నిలిచిపోయింది. రైతులు ఒక్కసారిగా ఎర్రకోటను ముట్టడించడంతో.. ఢిల్లీ పోలీసులు ఉక్కిరిబిక్కిరియ్యారు. ఎర్రకోటవైపు దూసుకెళ్లి.. ఆగస్ట్ 15 రోజు ప్రధాని జెండా ఎగరేసే ఫ్లాగ్ పోల్ పై రైతు జెండా ఎగరేశారు. అయితే అది రైతు జెండా కాదు.. సిక్కుల పవిత్ర జెండా అని కూడా అంటున్నారు.
రైతుల నిరసన ఈ స్థాయికి రాకుండా ముందుగానే నిరోధించడానికి కేంద్రానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ దేన్నీ వాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఓ దశలో సుప్రీంకోర్టు కూడా రైతుల ప్రతిపాదనకు అంగీకరించే దిశగా ఆలోచన చేయాలని కూడా సూచించింది. కానీ కేంద్రం మాత్రం తన వైఖరి మార్చుకోలేదు.రిపబ్లిక్ డే కవాతు సందర్భంగానే ఇన్ని పరిణామాలు జరిగాయి. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంటుకు పాదయాత్ర చేస్తామని రైతులు ప్రకటించారు. దీంతో అందరికీ అప్పుడే టెన్షన్ మొదలైపోయింది.
రెండు నెలల పాటు ఆందోళన చేస్తూ ఆగ్రహంతో ఉన్న రైతులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకున్నారని కొందరు వాదిస్తుంటే.. పరిస్థితి విషమించడానికి కేంద్రం బాధ్యతారాహిత్యమే కారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.