ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ కొనసాగుతూనే ఉంది. రాజధానికి సంబంధించి హైపవర్ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రులు కోరిన విషయం తెలిసిందే. ఇక అమరావతి కోసం రైతుల ఫిర్యాదుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 3,100మంది రైతులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు సీఆర్డీఏ ఫిర్యాదులు స్వీకరించనుంది. ఇదిలా ఉంటే..హైపవర్ కమిటీ శుక్రవారం మరోసారి భేటీ కానుంది. రైతుల సమస్యలు, రాజధాని అంశంపై చర్చించి ఓ నిర్ణాయానికి వచ్చే అవకాశముంది.
అలాగే రాజధాని తరలింపు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటికి పూర్తి చేయాలి? తదితర అంశాలపైనా భేటీలో ప్రస్తావించనున్నారు. కాగా, జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ.. ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపారు. జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యంలోని హైవర్ కమిటీ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కానుంది. ఇప్పటివరకు కమిటీ జరిపిన అధ్యయనం వివరాలివ్వనున్నట్టు తెలుస్తోంది.