మునగ ఆకులతో దాణా చెక్క.. ఎలా చేయాలంటే

-

పశువుల పోషణలో ముఖ్యంగా పచ్చగడ్డి, దాణా ఉంటేనే పాల దిగుబడి, వెన్న శాతం పెరగుతుంది. ఇచ్చే మేతలో మాంసకృత్తులు ఖచ్చితంగా ఉండాలి. జీవాల పెంపకందారులు కూడా జీవాలను పెంచేది మాంసం కోసమే. అధిక మాంసకృత్తులున్న ఆహారం ఇస్తే అవి త్వరగా కండ పట్టి మంచిగా బరువు పెరుగుతాయి. పప్పుజాతి పశుగ్రాసాలైన మునగ, అవిశే.. సుబాబుల్లో మాంసకృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి.

పచ్చిగడ్డి మాత్రమే పెట్టి ఎక్కువ దిగుబడి రావాలంటే కష్టం. మేతను సమతులంగా అందించాలంటే ఖచ్చితంగా పప్పుజాతి గ్రాసాలు ఉండాల్సిందే. మాంసకృత్తులు ఉండే విధంగా దాణా ఇవ్వాలంటే కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకూ ఖర్చుపెట్టాలి.. కానీ తక్కువ ఖర్చుతో ప్రోటీన్లు లభించేలా తక్కువ సమయంలో ఇంటి దగ్గరే మంచి పోషక విలువలున్న ఆకుల దాణాను 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలో చూద్దామా..!

మొదటిరకం

కావాల్సినవి మనగ/ అవివే/ సుబాబులో జమ్మి ఎండు ఆకులు (వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు కలిపి) 600 గ్రా. గంజి సుమారుగా అరలీటరు, ఉప్పు దాదాపు 15-20 గ్రా., మినరల్ మిక్సర్ (ఎముకల పొడి) 10-15 గ్రా.

రెండో రకం:

(గంజి దొరకనప్పుడు) కావాల్సినవి- మునగ/ అవిసె/ సుబాబుల్/ జమ్మి ఎండు ఆకులు: 600 గ్రా., గోధుమ పిండి 300 గ్రా.. ఉప్పు 15-20 గ్రా., మినరల్ మిక్సర్ (ఎముకల పొడి) 10-15 గ్రా.

తయారీ విధానం: మొదటి రకంలో ముందుగా వేడిగా దించుకున్న గంజిని గోరువెచ్చగా చల్లార్చి నిదానంగా ఉప్పు, ఎముకల పొడి మిశ్రమాన్ని కలపుకోవాలి. తర్వాత ఎండాకుల పొడిని గట్టిగా అయ్యే విధంగా కలిపి ముద్దలుగా చేసి ఏదేని పాలిథీన్ కవర్ పైన వడల రూపంలో చేసుకుని బాగా ఎండబెట్టాలి.

రెండో రకంలో గోధుమ పిండిని తీసుకుని వేడి నీటిలో కలపాలి. దానికి ముందుగా తగినంత చల్లటి నీటిలో కలపాలి. ఎందుకంటే ఒక్కసారిగా మరుగుతున్న నీటిలో కలిపితే ముద్దలుగా మారిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చగా చల్లార్చి ఉప్పు, ఎముకల పొడి మిశ్రమాన్ని కలపాలి. తర్వాత ఎండు ఆకుల పొడిని గట్టిగా అయ్యే విధంగా కలిపి ముద్దలుగా చేసి పైన చెప్పినట్లే.. పాలిథీన్ కవర్ పైన వడల రూపంలో వేసుకుని బాగా ఎండబెట్టాలి. ఈ రెండు పద్ధతుల్లో 250 గ్రా. ముడి బెల్లం వేడి దశలో కలిపితే ఇంకా మంచి బలమైన దాణా తయారవుతుంది.

ఎలా వాడాలంటే

ప్రతిరోజు పెద్ద పశువులకు అయితే 2 కిలోల వరకు, దూడలకు అర కిలో వరకు, గొర్రె/మేక పిల్లలకు 100-150 గ్రా., పెద్ద పొట్టేళ్లకు/ మేక పోతులకి/ గొర్రెలకు/ మేకలకు 250 గ్రా. వరకు తినిపించవచ్చు. తినిపించే ముందుగా. కొద్దిగా నీళ్లతో తడిపి లేదా ముంచి తినిపించాలి.

పోషక విలువలు:

ఎండు పదార్థం: 80.2 శాతం
ముడి మాంసకృత్తులు: 8.59 శాతం
ముడి పీచుపదార్థం: 30.3 శాతం

అవిశాకులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇరవై గుడ్లు, పది కప్పుల పాలు, అరకిలో మాంసం ద్వారా లభించే కాల్షియం ఓ గుప్పెడు అవిశాకుల్లో లభిస్తుందని మీకు తెలుసా?. ఇరవై కప్పుల పాలు, ఐదు కిలోల మాంసం ద్వారా లభించే ‘విటమిన్ ఎ’ ఓ గుప్పెడు ఆవిశాకులలో ఉంటుంది. ఇంకా ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, పిండిపదార్ధాలు, ప్రోటీన్లు అవిశాకుల్లో పుష్కలంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ‘
గంజి వాడడం వల్ల ఎక్కువ బలం వస్తుంది.
సుబాబుల్/ జమ్మిలో ప్రోటీన్లు ఎక్కువ శాతం లభిస్తాయి. బెల్లం వల్ల రక్తహీనత ఏర్పడదు. త్వరగా బలం వస్తుంది.

ప్రయోజనాలు:

ఎన్ని రోజులైనా చెడిపోదు.
అరుగుదల బాగుంటుంది.
దూడలకు మంచి దాణాగా పనికి వస్తుంది.
పశువుల్లో పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది.
పొట్టేలు పిల్లలకు మంచి ఆహారం, త్వరగా ఎదుగుదల కనిపిస్తుంది.
తక్కువ ధరలో, కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
ఎముకల పొడి వల్ల ఖనిజ లవణాలు బాగా అందుతాయి.
రక్తహీనతను నివారించవచ్చు.

పశువుల పెంపకం దారులు ఇలాంటి దాణా చెక్కలను తయారుచేసుకుని మంచి లభాలు పొందవచు. వీటిని తయారుచేయాడనికి కూడా పెద్దగా సమయం పట్టదు. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అంటే ఇదే..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news