ఓడిపోయిన సమాజం చిన్నచూపుతో చూస్తుంది. ఓడిపోయిన వారితో మాట్లాడడానికి ఎవరూ ఉండరు. ఓటమి ఒంటరిని చేస్తుంది. ఒంటరితనంలో వచ్చే ఆలోచనలు నిరాశజనకంగా ఉంటాయి. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నామన్న ఫీలింగ్ ఆత్మవిశ్వాసాన్ని పోగొడుతుంది. రెండుసార్లు ఓడిపోయావంటే అప్పటి వరకు నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా నీతో ఉండడానికి ఇష్టపడడు.
ఇదంతా చూసి కుంగిపోయి ఇక నా వల్ల కాదు అని పక్కకి తప్పుకుంటే అదే నువ్వు చేసిన పెద్ద తప్పు అవుతుంది. ఎన్ని సార్లు ఓడిపోయినా ఎందరు నిన్ను అవమానించినా, నీకేమీ చేతకాదని ఎవ్వరనుకున్నా ప్రయత్నం ఆపవద్దు. నీ ప్రయత్నంలో నువ్వు ఆనందం పొందుతున్నంత సేపు ప్రయత్నిస్తూనే ఉండు.
ఎందుకంటే ఒక పనికోసం ఎక్కువ సార్లు ప్రయత్నించడం చాలా మంది వల్ల కాని పని. అలాంటి పనిని నువ్వు చేస్తున్నావంటే నీలో ఏదో ఉందన్నట్టే లెక్క. నీ ప్రయత్నం ఏదో ఒకరోజు నిన్ను నీ లక్ష్యానికి చేరువ చేస్తుంది. అందుకే ప్రయత్నించడం మానద్దు.
ఆశపడి ఆచరిస్తేనే అందలం అందుతుంది. కొందరెందుకో ఆశపడడానికి కూడా ఆలోచిస్తారు. ఆచరించడానికి భయపడేవాళ్లే ప్రయత్నం చేయడానికి ఆసక్తి చూపరు. వాళ్ల గురించి వదిలెయ్. సమాజానికి సరెండర్ అయ్యి వాళ్ల పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు. నీ భవిష్యత్తు పట్ల ఆలోచన ఏదైనా అది నీ చేతుల్లోనే ఉండాలి. అలా లేనపుడు నీకు ఆనందం ఎలా వస్తుంది.
ఆనందంగా జీవించడమే ముఖ్యమైనపుడు అది అందుకునే ప్రయత్నమే మానేస్తే ఎలా? ఓడిపోవడం కూడా గొప్పే.. ఓడిపోతున్నావంటే నీ ఆలోచనల కంటే గొప్ప ప్రయత్నమేదో చేస్తున్నావన్నమాట. అందుకే ఓడిపోయినా ప్రయత్నం ఆపకండి. నిరాశతో కుంగిపోకండి.