టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన విలన్‌గా భావించిన ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించేందుకు, ఆయనను గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు, తాను పట్టుబట్టి ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేం దుకు చేయని ప్రయత్నం లేదు. మోడీ వ్యతిరేకులంతా కూడా తనకు ఆప్తమిత్రులేనని ప్రకటించిన చంద్రబాబు ఆవిధంగానే వ్యవ హరించారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తోను, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతోనూ చంద్రబాబు దోస్తీ కట్టారు.
ఢిల్లీలో కేజ్రీకి ఏ కష్టమొచ్చినా.. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో వాలిపోయేవారు. కేజ్రీకి నేనున్నానంటూ.. ఆయన వెంట నడిచారు. అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మంత్రులు కొందరు దాడి చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చి న చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి కేజ్రీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని, మోడీ దాష్టీకాలని ఎండగడతామని ప్రకటించారు. అంతేకాదు, దేశంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టే యజ్ఞంలో కేజ్రీతో కలిసి అడుగులు వేస్తామని కూడా బాబు ప్రకటించారు.
ఇక, ఏపీ ఎన్నికల సమయంలోను, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కేజ్రీని ఏపీకి పిలిపించి మరీ టీడీపీ తరఫున ప్రచారం చేయించుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేజ్రీని రంగంలోకి దింపి ఆయనతో ప్రచారం చేయించారు. మొత్తంగా చూస్తే.. అటు కేజ్రీ, ఇటు చంద్రబాబు ఉమ్మడి విలన్ మోడీపై ఇరువురు నాయకులు కూడా విరుచుకుపడ్డారు.
కట్ చేస్తే.. ఏపీలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చారో కూడా తెలిసిందే. అంటే.. మొత్తానికి మోడీపై చంద్రబాబు విసిరిన బాణం రివర్స్ అయింది. ఇక, కేజ్రీ విషయానికి వస్తే.. అదే మోడీపై ఆయన నిన్నటి వరకు పోరు సాగించారు. మోడీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఆయన అహరహం శ్రమించారు. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇక, మోడీ వైపు నుంచి కూడా పోరు బాగానే సాగింది. ఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు రిజర్వ్‌లో పడింది.
ఎన్నికల ఫలితాలకు ముందుగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే రిజల్ట్ వచ్చేసింది. వీటిని చూస్తే.. కేజ్రీవాల్ పార్టీ అనూహ్య విజయం ఖాయమని స్పష్టంగా తెలిసింది. అంటే.. మళ్లీ కేజ్రీనే అధికారంలోకి రానున్నారనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాదన. సో.. దీనిని బట్టి అక్కడ కేజ్రీ, ఇక్కడ చంద్రబాబు ఉమ్మడి శత్రువును ఎదుర్కొనడంలో కేజ్రీ సఫలమైతే.. బాబు విఫలమయ్యారని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి బాబులాగా కాకుండా కేజ్రీ వ్యూహాత్మకంగా ముందుకు సాగారనే వాదన వినిపిస్తోంది.