గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం..

దుండిగల్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి కానీ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం మాత్రం సంభవించినట్టు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.