కరోనా మహమ్మారి కారణంగా గత 4 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. కానీ ఎట్టకేలకు ఆంక్షలను సడలిస్తుండడంతో తిరిగి క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభిస్తున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ మైదానంలో మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. 4 నెలల విరామం అనంతరం ప్రారంభం అవుతున్న మొదటి క్రికెట్ మ్యాచ్, మొదటి టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం.
ఇక 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు ఈ సిరీస్‌లో మొత్తం 3 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. కరోనా వల్ల వాయిదా పడ్డ సిరీస్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఆయా దేశాలు క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో ఈ సిరీస్‌లో పలు రూల్స్‌ను మార్చారు. ప్లేయర్లు సోషల్ డిస్టన్స్ నిబంధనలను పూర్తిగా పాటించాల్సి ఉంటుంది. స్టేడియంలో జనాలు ఉండరు. బంతిపై ప్లేయర్లు ఉమ్మి రాయరాదు. వికెట్ తీసినా దూరంగా ఉండి సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లేయర్లు తమ క్యాప్‌లు, గ్లాసెస్, టవల్ ఇతర వస్తువులను అంపైర్లకు ఇవ్వరాదు. బంతిని ముట్టుకున్న వాళ్లు తరచూ హ్యాండ్ శానిటైజర్ వాడాలి. కళ్లు, ముక్కు, నోటిని వాడరాదు. బంతిపై ఉమ్మిరాస్తే రెండు సార్లు అంపైర్లు హెచ్చరిస్తారు. మూడోసారి కూడా అలా చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పాయింట్లు ఇస్తారు. అంపైర్లు కచ్చితంగా గ్లోవ్స్ ధరించాలి.
మ్యాచ్ సందర్భంగా ఎవరైనా ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ వస్తే మరో ప్లేయర్‌ను పెట్టుకునే అవకాశం ఇరు జట్లకు ఉంటుంది. మ్యాచ్‌లకు గాను లోకల్ అంపైర్ల సేవలనే ఉపయోగించుకుంటారు.