కష్టపడి పనిచేయాలి అన్న సంకల్పం, పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా, ఏ పని చేసైనా డబ్బులు సంపాదించవచ్చు. అందుకు స్త్రీ, పురుషుడు అన్న భేదం లేదు. తరతరాల నుంచి కుటుంబంలో డబ్బులు సంపాదించడం అన్నది కేవలం పురుషులు మాత్రమే చేస్తారనే ఓ వివక్ష ఉంది. కానీ ఆ మహిళలు మాత్రం ఆ వివక్షను రూపుమాపారు. తమ ప్రాంతంలో స్త్రీలు బయటకు రావడమే గొప్ప. అలాంటిది వారు ఏకంగా ఓ బీచ్ రెస్టారెంట్(Beach Restaurant)ను నిర్వహిస్తూ విజయవంతంగా స్వయం ఉపాధి పొందుతున్నారు.
తమిళనాడులోని పూంపుహార్ గ్రామం అది. అక్కడ బీచ్‌కు సమీపంలో మత్య్సకారుల కుటుంబాలు నివాసం ఉంటాయి. పురుషులు చేపల వేటకు వెళ్లి వస్తేగానీ వారికి పూట గడవదు. ఎంతో కష్టపడితే వారు నెలకు రూ.8వేల వరకు సంపాదిస్తారు. అదీ వాతావరణం అనుకూలించి చేపల వేటకు వెళ్లి అవి లభిస్తేనే. లేదంటే పస్తులు ఉండాలి. అయితే పురుషులు సంపాదించేది చాలడం లేదు కనుక తాము కూడా ఏదో ఒక పని చేస్తామని ఆ గ్రామానికి చెందిన కొందరు మహిళలు ముందుకు వచ్చారు.
ఆ గ్రామంలో నివాసం ఉండే ఉమ, సిల్వరాణి, రాజకుమారి, గీత, సరోజ అనే మహిళలు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూ.1 లక్షను ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో రుణంగా తీసుకుని బీచ్‌లోనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అలా వారు 2016 నుంచి ఆ రెస్టారెంట్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతంలో చాలా దూరం వరకు ఇంకో హోటల్ గానీ, రెస్టారెంట్ కానీ లేదు. అందువల్ల వారి రెస్టారెంట్ పాపులర్ అయింది. బీచ్‌కు వచ్చే వారు ఆ రెస్టారెంట్లో తినడం మొదలు పెట్టారు. అక్కడ ఫుడ్ ఉదయం 7 గంటలకు లభిస్తుంది. సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. ఇడ్లీ, వడ, దోశ వంటి బ్రేక్ఫాస్ట్లతోపాటు చేపలు, ఇతర మాంసాహారాలు, మీల్స్ వంటి ఆహారాలను వడ్డిస్తారు. ఎంతో రుచికరంగా ఉంటాయి. అందువల్ల తక్కువ సమయంలోనే వారి రెస్టారెంట్ పాపులర్ అయింది. దాంతో వారు నెలకు రూ.50వేలకు పైగా లాభం పొందుతున్నారు. వారి కుటుంబ అవసరాలు కూడా తీరుతున్నాయి.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సాహసం చేసి వారు అప్పు తీసుకుని మరీ రెస్టారెంట్ పెట్టారు. అందులో విజయవంతం అయ్యారు. వారు రెస్టారెంట్ పెట్టినప్పుడు ఆ గ్రామంలో అందరూ హేళన చేశారు. కానీ ఆ మహిళలను చూసిన వారు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అదీ.. వారు సాధించిన ఘనత. అందుకు వారిని అభినందించాల్సిందే..!