ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మోరాదాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మూడంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. వీరిలో ఒకరికి ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ సామగ్రిని బిల్డింగ్ కింది ఫ్లోర్‌లో ఉంచాడు. అయితే గురువారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి.
ఈ మంటలు మూడంతస్తుల బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అతికష్టం మీద ఏడుగురిని రక్షించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఐదు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటల్లో ఐదుగురు మృతి చెందగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ శైలేందర్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.